పేషీ కోసం పేచీ!
|
ప్రజలకు సేవ చేసేందుకు పోటీ పడలేని ప్రజాప్రతినిధులు తమకు హంగు ఆర్భాటాలతో ఉన్న పేషీల కోసం అర్రులు చాచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు కేటాయించిన కార్యాలయాన్ని ఓ శాఖ మంత్రి కావాలనడంపై.. ఆ శాఖకు సలహాదారుగా నియమితులైన మరో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఇటీవల సామాజిక న్యాయ సలహాదారుడిగా నియమితులైన జూపూడి ప్రభాకర్ విభేదాలు పొడచూపాయి. జూపూడి తన కార్యాలయం కోసం తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యాలయంలో ఐదో అంతస్తు కావాలని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఆర్భాటంగా చేయాలని భావించారు. ఇటీవల గురుకుల సొసైటీ కార్యాలయంలో సమీక్షకు వచ్చిన మంత్రి మేరుగ ఆ కార్యాలయం అప్పటి వరకు ఖాళీగా ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. తాను గురుకుల సొసైటీకి చైర్మన్ అని, గురుకుల సొసైటీలో చైర్మన్ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ జూపూడికి కేటాయించిన కార్యాలయాన్నే స్వాధీనం చేసుకుని తాళం వేయించారు.
అప్పటికప్పుడు ఏపీ ఎస్సీ గురుకుల సొసైటీ చైర్మన్ ఆఫీస్ అంటూ ఫ్లెక్సీలేర్పాటు చేశారు. ఆగ్రహించిన జూపూడి మంత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల స్థానంలోనే సామాజిక న్యాయ సలహదారు కార్యాలయమంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో మంత్రికి, సలహాదారులకు మధ్య పొసగడం లేదని బహిర్గతమైంది. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఆ పేషీని జూపూడికి అప్పగించాలంటూ సూచించడంతో జూపూడి తన పేరిట బోర్డు పెట్టేశారు. గతంలో వైసీపీలో ఉన్న జూపూడి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో చేరడం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం, ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు జూపూడి చెత్త తరలించే ఆటోలను కొనుగోలు చేసి ఎస్సీ యువతకు అందించాలని భావించారు. అయితే ఆయా ఏజెన్సీలు వాహనాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన అడ్వాన్స్ నిధులను కూడా తిరిగి చెల్లించలేదు. దీనిపై మంత్రి మేరుగు దృష్టిసారించారు.
ఆ ఏజెన్సీలు జూపూడి అనుయాయులేనని మంత్రి భావించినట్లు తెలుస్తోంది. ఈ వాహనాలకు ఇచ్చిన అడ్వాన్సు నిధులను వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉందని పదే పదే ఆయా ఏజెన్సీలకు నోటీసులిచ్చారు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత భగ్గుమన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. ప్రభుత్వ శాఖలన్నిటికీ తాను న్యాయ సలహాదారు అని, సాంఘిక సంక్షేమ శాఖలో కొన్ని కీలక అంశాలు అమలు చేయాలంటూ జూపూడి 11 పేజీల నోట్‌ను ఇటీవల ఆ శాఖకు పంపించారని సమాచారం. అయితే.. ఆ సలహాలను పాటించాల్సిన పని లేదంటూ ఆ నోట్‌ను మంత్రి చెత్తబుట్టలో పడేయడంతో.. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు చెప్పుకొంటున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|