సైబీరియన అతిథుల ఉనికికి ఎసరు
|
వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తూ కుగ్రామమైన వీరాపురానికి ప్రతి ఏటా వచ్చే సైబీరియన వలస పక్షుల ఉనికికి ఎసరు పెడుతున్నారు. అవి వీరాపురం పరిసర ప్రాంతాలకు రాకుండా చేయడానికి కొందరు పరోక్షంగా పన్నాగాలు పడుతున్నారు. వాటి నివాసాలుగా ఉన్న పచ్చని చెట్లును నిర్ధాక్ష్యిణంగా నరికేస్తున్నారు. దీంతో ఒకప్పుడు పచ్చనిచెట్ల కు నిలయమైన వీరాపురం ఇప్పుడు ఎడారిలా మారుతోంది. గ్రామానికి చుట్టుప క్కల, రైతుల పొలాల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న మహా వృక్షాలను నామమాత్ర అనుమతులు తీసుకొని కూకటి వెళ్లతో పెకలిస్తున్నారు.
వందల చెట్ల నరికివేత
కేవలం రెండు, మూడు నెలల కాలంలో వందలాది మహా వృక్షాలను నరికేశారంటే వీరాపురం గ్రామ పరిశరాల్లో పచ్చదనం ఏకంగా నాశనమవుతోందో అర్థమవుతోంది. కొందరు రైతులు ఆర్థిక అవసరాలకు తమ పొలంలో ముఫ్పై నలభై ఏళ్లుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను వ్యాపారులకు అమ్ముతున్నారు. కొందరు ఇంటి సామాగ్రి తయారు చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పచ్చని చెట్లను రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలున్నాయి. చెట్ల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో నివాసాల ఏర్పాటు పక్షులకు కష్టంగా మారుతోంది. వందల సంవత్సరాలుగా సైబీరియన నుంచి వచ్చి వీరాపురం గ్రామంలో విడిది చేయడం ఈ పక్షులకు అలవాటుగా మారింది. ప్రస్తుతం వీరాపురంలో పచ్చనిచెట్ల కొరత తీవ్రంగా ఉండటంతో అవి వెంకటాపురం తదితర సమీప గ్రామాలకు మకాం మార్చాయి. అక్కడ కూడా చెట్లను నరికివేస్తే తుదకు సైబీరియన పక్షులు వలస వచ్చి మృత్యువాత పడటం తప్పదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అలాగే గతంలో గ్రామంలో మర్రి, రాగి, చింత వంటి మహా వృక్షాలు ఉండేవి. వాటిపై ఏళ్ల తరబడి పక్షులు ఆవాసాలు ఏర్పాటుచేసుకున్నాయి. చెట్లపై పక్షులు విసర్జించే రెట్ట కారణంగా పచ్చనిచెట్లు ఎండిపోతూ వచ్చాయి. ఇప్పుడు గ్రామంలో పక్షులకు అవసరమైనన్ని చెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో పక్షులు పక్క గ్రామమైన వెంకటాపురానికి మకాం మార్చాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|