అదానీ కంపెనీకి భారత్‌కన్నా అధిక రేటింగ్!
|
ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీకి త్వరలో భారత పరపతికి మించిన రేటింగ్ లభించనుంది. తమ గ్రూప్‌లోని ఓ కంపెనీకి దేశ పరపతి రేటింగ్‌కు మించిన రేటింగ్ దక్కనుందని అదానీ గ్రూప్ సీఎ్‌ఫఓ జుగేశిందర్ సింగ్ ఈనెల 10న ఢిల్లీలో కొంతమంది ఇన్వెస్టర్ల బృందానికి తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడనుందన్నారు. అయితే, ఆయన కంపెనీ పేరును మాత్రం వెల్లడించలేదు. పూర్తిగా దేశీయంగానే వ్యాపారం కొనసాగిస్తున్న కంపెనీకి దేశ పరపతికి మించిన రేటింగ్ లభించనుండటం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన ఎస్ అండ్ పీ, ఫిచ్ భారత్‌కు ‘బీబీబీ మైనస్’ పరపతి రేటింగ్‌ను కేటాయించాయి. మూడీస్ బీఏఏ3 రేటింగ్ ఇచ్చింది. పెట్టుబడులకు అనుకూలమైన రేటింగ్‌లలో ఇదే కనిష్ఠ స్థాయి. ప్రభుత్వ రంగ దిగ్గజాలతో సహా చాలావరకు కంపెనీలు ప్రస్తుతం భారత పరపతి రేటింగ్‌కు సమానమైన లేదా తక్కువ రేటింగ్‌ను మాత్రమే కలిగి ఉన్నాయి. కాగా, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు గత ఏడాది జూన్‌లో భారత పరపతికి మించిన రేటింగ్‌ను ఫిచ్ కేటాయించింది. అయితే, రిలయన్స్ విదేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ మాత్రమే భారత పరపతి రేటింగ్‌కు సమానమైన రేటింగ్ కలిగి ఉంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|