వర్షం.. భారీనష్టం
|
ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రధానంగా బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు ఛిద్రమయ్యాయి. చేతికొచ్చే పంట నీటిపాలై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కర్నూలు జిల్లాలో ఒక్క రోజే 56.8 మి.మీల వర్షం కురిసింది. నందవరం మండలంలో అత్యధికంగా 160.2 మి.మీల వర్షపాతం నమోదైంది. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి.
నంద్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో 4,490 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 881 ఎకరాలు కలిపి 5,371 ఎకరాల్లో పత్తి, ఉల్లి, టమాటా, మొక్కజొన్న, కంది వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.25 వేల లెక్కన రూ.13.40 కోట్లకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేస్తే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 250కి పైగా నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అవుకు మండలంలోని సీతారామపురం చెరువుక్ట తెగిపోయింది. ఆదోని ఫరుషామొహల్లాలో వర్షానికి ఇంటి పైకప్పు కూలి ఫరీద్‌సాహెబ్ (65) మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. సుంకేసుల నుంచి 1.17 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. హంద్రీ నదికి 34 వేల క్యూసెక్కులు వరద రావడంతో గాజులదిన్నె ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. కర్నూలు నగరంలో హంద్రీ నది నిండుగా ప్రవహిస్తోంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|