టార్పాలిన్లు ఏవీ?
|
వ్యవసాయశాఖ నాలుగున్నరేళ్ల కిందట వరకు రాయితీపై టార్పాలిన్లు (పరదాలు) రైతులకు అందించేది. మార్కెట్ ధరలో యాబై శాతం రైతుల నుంచి తీసుకుని మిగతా మొత్తం ప్రభుత్వం భరించేది. ఒక్కో రైతుకు రెండేసి టార్పాలిన్లు ఇవ్వడంతో వాటిని వినియోగించుకునేవారు. గత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ పరికరాలతో పాటు టార్పాలిన్లు రాయితీపై అందించింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా రాయితీపై ఒక్క పరికరం కాదుకదా.. పరదా కూడా అందించలేదు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వేళ పంటలు కాపాడుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 30 మండలాల్లో ఏడు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను 50శాతం రాయితీపై అందించేవారు. చిన్న రైతులకు ఎక్కువగా ఉపయోగపడే టార్పాలిన్లు మార్కెట్ ధర రూ.2,500 ఉంటే వాటిని రూ.1,250కే ఇచ్చేవారు. ఏటా మండలానికి 300 నుంచి 350 వరకు సరఫరా చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయితీ టార్పాలిన్లు పంపిణీకి స్వస్తి పలికింది. దీంతో రైతులు మార్కెట్‌లో రూ.3,500 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అంత డబ్బులు పెట్టి కొనలేని రైతులు సిమెంట్, ఎరువుల సంచులతో తయారు చేసిన టార్పాలిన్లు కొని సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు కోస్తున్నారు. తుఫానుతో పంటను ఆరబెట్టేందకు, వాటిలోని తేమశాతం తగ్గించేందుకు టార్పాలిన్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయితీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|